వైకాపాకు తెరాస లోపాయికారి మద్దతు: చంద్రబాబు

Dfrc mou0aanblx
PTI | Updated :February 18, 2019,19:40 IST

2014 తర్వాత రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు తలపెట్టి ఇప్పటి వరకు 19 పూర్తి చేశామని.. మిగతా ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడారు. కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని.. ఇక్కడ మ్యూజియం, జంతు ప్రదర్శనశాల, బొటానికల్‌ గార్డెన్‌, స్టార్‌హోటల్‌ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొండవీడు అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు. 8శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. పోలవరం పూర్తి చేయడమే తన జీవితాశయమని.. జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలలే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానన్నారు. బ్యాంకు సిబ్బంది అక్రమాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. రైతులకు అండగా ఉండాలనే అన్నదాతా సుఖీభవ పథకం తీసుకొచ్చామని సీఎం వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యువనేస్తం కింద రూ.2వేలు అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

నిత్యం ప్రజల్లో ఉండేవారికే టికెట్లు

నవ్యాంధ్ర అభివృద్ధికి తెరాస అడుగడుగునా అడ్డుపడుతోందని.. వైకాపాకు ఆ పార్టీ లోపాయికారిగా మద్దతిస్తోందని సీఎం మండిపడ్డారు. ప్రధాని మోదీ మరోసారి రాష్ట్ర విభజన గాయాలను రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలని చంద్రబాబు సూచించారు. పదవులు రావనే భయంతోనే కొంతమంది పార్టీలు మారుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేవారికే టికెట్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

Source: Eenadu