చంద్రబాబు హయాంలో హోదా రాదు

Ap politics1a 5
PTI | Updated :February 19, 2019,04:56 IST


ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాదని అమలాపురం ఎంపీ  పి.రవీంద్రబాబు విమర్శించారు. తెదేపాకు, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన సోమవారం జగన్మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వైకాపాలో చేరారు. అనంతరం రవీంద్రబాబు మాట్లాడుతూ.. హోదా విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని, కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఆయన అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వైఖరితో బాధపడినందున తెదేపాను వీడి వైకాపాలో చేరినట్లు వివరించారు. ప్రత్యేక హోదా కావాలని తామంతా కోరితే అవసరం లేదని, ప్యాకేజీ చాలని చంద్రబాబు తమను బలవంతంగా ఒప్పించారని, ప్యాకేజీ కూడా పెద్దగా రాలేదని పేర్కొన్నారు. తెదేపాలో దళితులను చిన్నచూపు చూస్తున్నారని, సభలో తామెంత మాట్లాడినా పట్టించుకోలేదని.. చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారు మాట్లాడితే వారికి ఊరేగింపులు, సన్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డిని పార్టీ రాష్ట్ర, జాతీయ అధికార ప్రతినిధిగా నియమించినట్లు వైకాపా కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

వైకాపా ‘బీసీ డిక్లరేషన్‌’ చరిత్రలో నిలిచిపోతుంది: బొత్స

వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఏలూరు సభలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్‌ చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఉన్న నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రాగానే బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువస్తామని జగన్‌ చేసిన ప్రకటనతో బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం బీసీ సబ్‌ప్లాన్‌కు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారో ప్రకటించలేదన్నారు. వైకాపా విధివిధానాలను చూసే కొత్తగా పలువురు నేతలు తమ పార్టీలో చేరుతున్నారని బొత్స అన్నారు.

పార్టీ మారడంలో స్వార్థం లేదు: ఎంపీ అవంతి

తాను పార్టీ మారడంలో స్వార్థం లేదని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తెదేపా నుంచి వైకాపాలోకి రావడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన విమర్శల మీద స్పందించారు. ఎవరి కులం వారితో వారినే తిట్టించడం తెదేపా నైజమని మండిపడ్డారు.

నేడు జగన్‌తో కృపారాణి భేటీ!

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి మంగళవారం వైకాపా అధినేత జగన్‌ను హైదరాబాద్‌లో కలవనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో జిల్లాలో రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. 2004, 2009, 2014ల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. 2009లో గెలుపొందాక కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పదవి వరించింది. టెక్కలి శాసనసభ స్థానం నుంచి వైకాపా తరఫున పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారని, ఆమెను లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలపాలని ఆ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఆమె వైకాపాలో చేరనున్నారనే విషయాన్ని కుటుంబ సభ్యులు మాత్రం తోసిపుచ్చుతున్నారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు.

Source: Eenadu