బీసీలపై జగన్‌ మొసలి కన్నీళ్లు

Ap main3a 9
PTI | Updated :February 19, 2019,04:52 IST

 తెదేపా జయహో బీసీ సభ విజయవంతం కావడంతో వైకాపా బెంబేలెత్తిందని, దాన్ని జీర్ణించుకోలేకే తెదేపాపై విమర్శలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, నిస్పృహతోనే ఏలూరులో బీసీ సభ పెట్టారని పేర్కొన్నారు. ఎవరెన్ని పన్నాగాలు చేసినా బీసీలు తెదేపా వెంటే ఉంటారని వివరించారు. ‘జగన్‌ మొసలికన్నీళ్లను బీసీలు నమ్మరు. జగన్‌ తండ్రి వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను అణచివేశారు. దీనిపై తెదేపా చాలా పోరాటాలు చేసింది. ఇప్పుడు జగన్‌ బీసీలను ఏదో ఒకలా మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. బీసీ ఉపప్రణాళికకు తెదేపా ప్రభుత్వం చట్టబద్ధత తెస్తే మళ్లీ చట్టం చేస్తాననడం జగన్‌ అవివేకానికి నిదర్శనం’ అని సోమవారం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం అన్నారు. ‘బడ్జెట్‌, నిధుల విడుదల గురించి జగన్‌కు తెలియదు. అవినీతి సంపద పెంచుకోవడం మాత్రమే ఆయనకు తెలుసు. సమాజసంపద పెంచడం చేతకాదు’ అని పేర్కొన్నారు. ‘వైఎస్‌ హయాంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐదేళ్ల తెదేపా పాలనలో వారిలో పూర్తి భరోసా కల్పించాం. కౌలు రైతు కుటుంబానికి రూ.15 వేలు ఇస్తున్నాం. కేంద్రం ఇవ్వకపోయినా ఆ మొత్తాన్ని రాష్ట్రమే ఇస్తోంది. కౌలు రైతులకు రూ.9,654 కోట్ల పంట రుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు’ అని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైకాపాకు అద్దె మైకు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ వాళ్ల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. తెదేపా ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడుందని అంటున్నారు’ అని మండిపడ్డారు. ‘కాపు కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి రూ.4 వేల కోట్లు ఖర్చుచేశాం. వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించి పంపితే గవర్నర్‌ ఇంకా ఆమోదించలేదు. ఆయనతోనూ మాట్లాడి త్వరగా ఆమోదించేలా చూస్తాం. చట్టాన్ని ఆపే అధికారం ఆయనకూ లేదు’ అని సీఎం వ్యాఖ్యానించారు. కొందరు నాయకులకు పదవులిస్తే ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లిపోయారని, అయినా తెదేపాకు నష్టమేమీ లేదని పేర్కొన్నారు. వాళ్లు తమ ఆస్తులను కాపాడుకోడానికి కులాలను, పదవులను అడ్డు పెట్టుకోవడమే బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఇక జనంలో ఉండాల్సిందే

ఎన్నికలు దగ్గర్లోకి వచ్చేశాయని, పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు అందరూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2019-24కి అత్యుత్తమ బృందాన్ని ఎంపిక చేయాలన్నదే తన అభిమతమన్నారు. ప్రజలకు చేయాల్సినవన్నీ చేసేశామని, ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించానని తెలిపారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్నారు.

చంద్రబాబుతో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భేటీ
అమరావతిలో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం అమరావతిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరి భేటీ జరిగింది. రాత్రి బాగా పొద్దు పోయేంత వరకు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. దేశ రాజకీయాలు, జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. భాజపాయేతర పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల అవగాహన, అది కుదరని చోట ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఎలా ఉండాలి? ఎన్నికల అనంతర పొత్తులకు ఒక ప్రాతిపదిక సిద్ధం చేయడం వంటి అంశాలపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో దిల్లీలో భాజపాయేతర పార్టీ నాయకులంతా మరోసారి భేటీ కానున్నారని, ఆ అంశంపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. జాతీయ స్థాయిలో భాజపాయేతర కూటమిలో కాంగ్రెస్‌, ఆప్‌ కూడా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దిల్లీలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ అవగాహన ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలపైనా చంద్రబాబుతో కేజ్రీవాల్‌ చర్చించినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం విజయవాడ చేరుకున్న కేజ్రీవాల్‌కి గన్నవరం విమానాశ్రయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న కేజ్రీవాల్‌ని మంత్రి లోకేశ్‌ సాదరంగా ఆహ్వానించారు. కేజ్రీవాల్‌ వెంట ఆప్‌ నాయకుడు, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా ఉన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ వైఖరికి నిరసనగా ఆ రాష్ట్ర సీఎం నారాయణస్వామి చేస్తోన్న ధర్నాకు సంఘీభావం తెలియజేసి అమరావతికి వచ్చారు.

Source: Eenadu