దేశ ప్రజలకు అది చీకటి రోజు పుల్వామా ఘటనపై మరోసారి సానియా మీర్జా ట్వీట్‌

Sania mirza1
PTI | Updated :February 18, 2019,05:34 IST

ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరోసారి పుల్వామా ఘటనపై స్పందించారు. 40 మందిని పొట్టన పెట్టుకున్న ఈ దారుణం తనని ఎంతో కలిచి వేసిందని ఆమె ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. అయితే ఘటన జరిగిన రోజున సానియాను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఆమె పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే దాడిపై తొలుత సానియా స్పందించలేదు. తన వ్యక్తిగత ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు.పుల్వామా దాడిలోనూ పాకిస్థాన్‌ హస్తం ఉండటంతో నెటిజన్లు సానియాపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. కొంత సేపటి తర్వాత ఆత్మాహుతి దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ ఘటన గురించి ఓ లేఖలో రాసి దాన్ని పోస్ట్‌ చేసింది.

‘పుల్వామా ఘటనపై ప్రముఖులందరూ స్పందించాలనే వారికి ఈ పోస్టు పెడుతున్నాను.మన దేశంలో హింసకు తావు లేదు. హింసకు దారి తీసే అంశాలన్నింటినీ మనం విచ్ఛిన్నం చేయాలి. ఈ దానిని బహిరంగంగా ఖండించాల్సిన అవసరం లేదు. మనం ఉగ్రవాదానికి వ్యతిరేకం అని ఏకతాటిపై నిలబడాలి. నా దేశం గురించి నేను ప్రార్థిస్తున్నాను. దాని కోసం నేను చెమట చిందిస్తున్నాను. ఇదే నేను దేశానికి చేసే సేవ. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు నేను మద్దతుగా ఉంటాను. మన దేశాన్ని రక్షిస్తున్న హీరోలకు మనం సాయపడాలి. గౌరవించాలి. 14 ఫిబ్రవరి దేశ ప్రజలకు చీకటి రోజు. మరోసారి ఇలాంటి రోజు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. జవాన్ల కుటుంబాలను మన సంతాపాలు గట్టెకించవు. ఇంకా ఏదో చేయాలి. ఆ రోజును మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారిని(నిందితులను)క్షమించకూడదు.ఇలాంటి సమయాల్లో మన దేశానికి సేవ చేసే మార్గాలను వెతుక్కోవాలి కానీ...ఏ ప్రముఖులు ఎలా స్పందిస్తున్నారనేది అప్రస్తుతం. ప్రముఖులు ఎన్ని పోస్టులు పెట్టారు? ఈ భయానక దాడి మీద ఎంత సేపు మాట్లాడరనే దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికీ లాభం లేదు. మీరేమి చేయగలరో అన్నీ చేయండి. సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకోకుండా సాయం చేయండి’ అని లేఖలో చెప్పుకొచ్చింది.

Source : Eenadu