ఈ వీడియో చూసేసరికి.. నేను స్వర్గంలో ఉంటా పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాది వీడియో విడుదల చేసిన జేఈఎం

14brk terror
PTI | Updated :February 14, 2019,19:46 IST

 ‘మీరు ఈ వీడియో చూసేసరికి.. నేను స్వర్గంలో ఉంటా’ ఇవి పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ బలగాలను పొట్టన బెట్టుకున్న ఉగ్రవాది చివరి మాటలు. ఈ దాడి జరగడానికి కొన్ని నిమిషాల తర్వాత జైషే ఈ మహ్మద్‌ ఉగ్ర సంస్థ అదిల్‌ అహ్మద్‌ మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జైషే జెండా ముందు అదిల్‌ ఆటోమెటిక్‌ రైఫిల్స్‌ను తగిలించుకుని కనిపిస్తాడు. ‘ఈ వీడియో మీ దగ్గరకు చేరే సరికి నేను స్వర్గంలో ఉంటాను. జేఈఎంలో మిలిటెంట్‌గా ఏడాది పాటు ఉన్నాను. కశ్మీరీ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇది. దక్షిణ కశ్మీర్‌ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు నార్త్‌, సెంట్రల్‌ కశ్మీరీలతో పాటు జమ్ము ప్రజలు కూడా మాతో చేరాల్సిన సమయం వచ్చింది. మా మిలిటెంట్‌ కమాండర్లను కొంతమందిని చంపినంత మాత్రాన మేము బలహీనపడిపోతామని అనుకోవద్దు’ అని అదిల్‌ హెచ్చరిస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. అదిల్‌ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి. 2016, మార్చి 19 నుంచి అదిల్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు తౌసీఫ్‌, వసీమ్‌ కనిపించడం లేదని అక్కడి పోలీసులు తెలిపారు.

జమ్ములో జరిగిన కొన్ని ఉగ్రదాడులు..
* 2001లో జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ గేట్‌ వద్ద జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. టాటా సుమోలో భారీగా పేలుడు పదార్థాలతో గేటు వద్దకు వెళ్లిన ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ ఘటనలో శాసనసభ్యులు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

* 2015, మార్చి 20న ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులు ధరించి కతువా జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా వారిలో ముగ్గురు స్పెషల్‌ ఫోర్స్‌ అధికారులు ఉన్నారు. పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

* ఈ ఘటన జరిగిన మరుసటి రోజే జమ్ము-పఠాన్‌కోట్‌ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఇందులో ముగ్గురు గాయపడ్డారు.

* అదే ఏడాది డిసెంబరులో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులు ధరించి అనంత్‌నాగ్‌ సమీపంలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

 

Source: Eenadu