జగన్‌కు మోదీని నిగ్గదీసే ధైర్యం లేదు:చంద్రబాబు ​​​​​​​

Naidu
PTI | Updated :January 31, 2019,06:57 IST

మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే రాష్ట్రంలో అరాచకం సృష్టించి భవిష్యత్తును అంధకారం చేస్తారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 11న దిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు ఇప్పటినుంచే సమాయత్తమవుతూ అందరూ సిద్ధం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తెదేపా నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంటులో తెదేపా ఎంపీలు పోరాటాన్ని మరింత తీవ్రం చేయాలని సూచించారు. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు జరపాలని ఆయన సూచించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా.. ప్రజాసాధికారతే లక్ష్యంగా తెదేపా ముందుకెళ్లాలని నేతలతో చెప్పారు. 

 

అన్ని వర్గాల మద్దతు తెదేపాకే ఉండాలి

శాసనసభలో గవర్నర్ ప్రసంగం రాష్ట్ర నాలుగేళ్ల అభివృద్ధిని ప్రతిబింబించిందని చంద్రబాబు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు గవర్నర్ ప్రసంగం నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకోవడానికి కావాల్సిన పునాదులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం నిలదొక్కుకుందంటే అది తెదేపా ప్రభుత్వం వల్లేనని చెప్పారు. ఇది ప్రతి కార్యకర్తకు, నాయకుడికి గర్వ కారణమన్నారు. అన్నివర్గాల మద్దతు తెదేపాకు ఏకపక్షం కావాలని నేతలకు సూచించారు. 

 

జగన్‌కు నిగ్గదీసే ధైర్యం లేదు

హక్కుగా రాష్ట్రానికి రావాల్సి నిధులు ఇవ్వకుండా భాజపా తమపై దాడులు చేస్తోందని.. అఖిలపక్ష సమావేశంలో అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారని చెప్పారు. వైకాపాతో భాజపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని.. అటు తెరాస అధినేత కేసీఆర్‌, ఇటు వైకాపా అధ్యక్షుడు జగన్‌ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ వాళ్లను ప్రోత్సహిస్తున్నారని సీఎం ఆరోపించారు. మూడుపార్టీలూ లాలూచీపడి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ ధోరణి వల్లే సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మళ్లీ దీక్ష చేసే దుస్థితి వచ్చిందన్నారు. మోదీ ఒంటెత్తు పోకడలు నచ్చకే జాతీయ గణాంకాల కమిషన్ లో ఇద్దరు సభ్యులు రాజీనామా చేశారని గుర్తుచేశారు. జగన్ కు ప్రధానిని నిగ్గదీసే ధైర్యం లేదని దుయ్యబ్టటారు. అన్నివర్గాలను అణిచేయాలని భాజపా చూస్తోందని అన్నారు.

Source : Eenadu