జగన్‌ పదే పదే అవమానించారు గాలికి కొట్టుకుపోతావనేవారు

24ap main5b 3
PTI | Updated :January 25, 2019,06:13 IST

వైకాపాలో తానే సర్వస్వం, తాను చెప్పిందే వేదం, ఎవరైనా నా కిందోడే అనేలా జగన్‌ తీరు ఉంటోందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. ఆ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, వాటన్నింటినీ భరించినా ఇంకా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తూ, అల్లరి పెట్టాలని చూడడం వల్లే వైకాపాకు రాజీనామా చేసి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. తనను చంపుతామంటూ, అంతు చూస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వైకాపాకు చెందిన వాళ్లు బెదిరింపులకు సైతం దిగారన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం విలేకరులతో రాధా మాట్లాడారు. కేవలం తండ్రి లేని వాడివనే జాలితోనే వైకాపాలో ఉండనిస్తున్నానని, వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావంటూ జగన్‌ తనను పదే పదే అవమానిస్తూ వచ్చారన్నారు. తన తండ్రిపై అభిమానంతో కొందరు విగ్రహం పెడుతుంటే.. ఆ కార్యక్రమానికి తాను వెళ్లడం తప్పని, ఎవరికి చెప్పి వెళ్లావంటూ తనను జగన్‌ నిలదీయడంతోపాటు అవమానకరంగా మాట్లాడారన్నారు. పార్టీలో చేరినప్పుడు తనను తమ్ముడంటూ స్వాగతించిన జగన్‌, ఇంత జరుగుతున్నా కనీసం ఒక్క ఫోనూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా తాను బాధపడలేదని, కానీ.. సూటిపోటి మాటలతో వేధించి బయటకు వెళ్లేలా చేశారన్నారు.


ప్రజలు మాపై చూపేది జాలి కాదు
ఇప్పటికైనా జగన్‌రెడ్డి తన పద్ధతులను మార్చుకుని రంగా అభిమానులను గౌరవిస్తే మంచిదని రాధా సూచించారు. ప్రజలు తమపై చూపించేది జాలి కాదని, తన తండ్రి చనిపోయి.. 30ఏళ్లయినా అదే అభిమానం నేటికీ ఉందంటే.. అది ఆయన గొప్పతనమన్నారు. ఆయన ఆశయాల సాధనే తన ఏకైక లక్ష్యమని, తన వాళ్లను కాపాడుకోవడమే ధ్యేయమని రాధా స్పష్టం చేశారు.

అది కొందరు వ్యక్తులు చేసిన పని
ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడంటూ మీరు ప్రకటించినప్పుడు.. మీ పార్టీలో ఎందుకుండాలని రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 11 నుంచి తను పార్టీలో ఉన్నా.. లేనట్టే తీసి పక్కన పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రంగాను చంపిన పార్టీలోకి ఎలా వెళ్తావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే కొందరు వ్యక్తులు చేసిన పనిని.. తెదేపాకు ఆపాదించడం సరికాదన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో తనను పార్టీలోకి ఆహ్వానించారని రాధా వెల్లడించారు. తన కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చారన్నారు. తాను ఏ పార్టీలో చేరుతున్నాననే విషయంపై మాత్రం రాధా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తన వాళ్ల కోసం ప్రజాజీవితంలో కొనసాగుతానని మాత్రమే స్పష్టం చేశారు.

 

Source: Eenadu