ఆడబిడ్డలూ..ఆశీర్వదించండి మూడు విడతలుగా పసుపు, కుంకుమ సొమ్ము

Ap main6b
PTI | Updated :January 26, 2019,03:54 IST

డ్వాక్రా సభ్యులు చైతన్య దీపికలుగా మారి పనిచేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం నేలపాడు సమీపంలో, కడప, విశాఖ నగరాలలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన ప్రాంతీయ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. మూడు సదస్సుల్లో సమీప జిల్లాల డ్వాక్రా సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘మన మధ్య రక్తసంబంధం లేకపోయినా పూర్వజన్మ రుణానుబంధం ఉంది. మరో ఆరు లక్షల మంది సభ్యులు చేరితే ఈ అన్నకు కోటి మంది చెల్లెమ్మల సైన్యం తయారవుతుంది. ఇది నా అదృష్టమే. నా వ్యక్తిగత విజయం. అందుకే వారికి అన్ని విధాలా అండగా ఉంటా. రూ.200 పింఛను రూ.రెండు వేలు చేసిన ఘనత నాదే. రూ.200 ఇచ్చిన గత ప్రభుత్వాలు రెండువేల సార్లు ఆ విషయాన్ని చెప్పుకున్నాయి. రూ.రెండు వేలు ఇస్తున్న నేను ఎన్నిసార్లు చెప్పుకోవాలి? ప్రతి డ్వాక్రా మహిళను పారిశ్రామికవేత్తగా మార్చుతా. స్వయంసహాయక బృందాలకు ఆహారశుద్ధి పరిశ్రమల కింద ఐదేళ్లలో రూ.750 కోట్లు ఇస్తా’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలతోపాటు పనిముట్లను కూడా ఆడపిల్లల పేరిటే ఇస్తున్నామని గుర్తుచేశారు. ‘ఆడపిల్లలకు కట్నంగా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఇస్తున్నాం. నాకు మళ్లీ అధికారమిస్తే మరిన్ని పసుపు కుంకుమలు ఇస్తా. కేవలం ఆర్థికంగానే కాకుండా రాజకీయంగానూ ఎదగడానికి వీలుగా వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ అవకాశాలను కల్పిస్తా. ఓ యువతి తొమ్మిదో తరగతిలో ఉండగా పెళ్లవడంతో కుటుంబ బాధ్యతల్ని మోస్తూ డ్వాక్రాలో చేరి పిల్లలను చదివించుకుంది. తాను కూడా కుమారుడితోపాటు ఎంబీఏ చదువుతూ ఆదర్శంగా నిలుస్తోంది’ అని ప్రశంసించారు. 
75 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. చిన్న పొరపాటు జరిగి మనం రాకపోతే వెనక్కి వెళ్లిపోతాం. సుస్థిర పాలన కొనసాగాలి. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు, 150కిపైగా ఎమ్మెల్యేలను గెలిపిస్తే పాలన సునాయాసంగా ఉంటుంది. అది మీ నుంచి ఆశిస్తున్నా. మన, పిల్లల భవిష్యత్తు కోసం 75 రోజులు పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని మహిళలను ప్రశ్నించారు. ‘ఎవరైనా మనల్ని విమర్శిస్తే చితగ్గొట్టాలి. అడ్డుకోడానికి చూస్తే భరతం పడతామనాలి’ అని సూచించారు. చెల్లెమ్మల ఆశీర్వాదం ఉంటే కొండలనైనా పిండి చేసే శక్తి వస్తుందన్నారు. చెల్లెమ్మలకు డబ్బులిచ్చే అధికారం ముఖ్యమంత్రికి ఉండదా? అని ప్రశ్నించారు. 

వంద రెట్లు పెంచాం.. 
‘ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం పసుపు కుంకుమకు శ్రీకారం చుట్టాం. మీకు కష్టమొస్తే ఎవరూ ఆదుకోరని నేరుగా రూ.20వేలు ఇస్తున్నా. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు పండగలా చెక్కులిస్తాం. ఫిబ్రవరి ఒకటిన రూ.2500, మార్చి 8న రూ.3500, ఏప్రిల్‌ 5న రూ.4వేలు వారి ఖాతాల్లో నుంచి తీసుకోవచ్చు. తొలి విడత ప్రతి సభ్యురాలికి రూ.10వేల చొప్పున రూ.8604 కోట్లు, వడ్డీ రాయితీ కింద రూ.2514 కోట్లు, ప్రస్తుతం ఇస్తున్న రూ.10వేలకు రూ.9400 కోట్లు కలిపి రూ.21వేల కోట్లకుపైగా ఇస్తున్నాం’ అని  వివరించారు. ‘ఈతరం పెళ్లిళ్లు వద్దు.. పిల్లలను కనం అంటున్నారు. వారిని డ్వాక్రా మహిళలు చైతన్యపర్చి పిల్లల సంఖ్య పెరిగేలా చూడాలి. నలుగురు పిల్లలున్నా ప్రోత్సహించాలని నిర్ణయించాం’ అని వివరించారు. వైఎస్‌ ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు రూ.200కోట్లు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఇచ్చింది.  మేం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో రూ.21వేల కోట్లు ఇచ్చాం. ఇది వంద రెట్లు ఎక్కువ’ అని గుర్తు చేశారు. 


డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే ఆదర్శం 
‘ప్రకృతి సేద్యంలో రాష్ట్ర విజయం డ్వాక్రా సంఘాల వల్లే సాధ్యమైంది. మన గ్రామంలో ప్రకృతి సేద్యంలో పండించిన ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి విదేశాలకు పంపి ప్రపంచానికే దిక్సూచిగా నిలవాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘త్వరలో డ్వాక్రా సభ్యులందరికీ స్మార్ట్‌ఫోన్లు ఇస్తాం. 1.40 కోట్ల మందికి అందిస్తాం. చరవాణి చేతిలో ఉంటే ప్రభుత్వ సేవలు యాప్‌ ద్వారా పొందవచ్చు. మీరు తయారుచేస్తున్న వస్తువులను పోర్టల్‌లో పెట్టుకుని విక్రయించుకోవచ్చు. ఎక్కడికక్కడ చెల్లింపులు చేసే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. అలాంటి వ్యవస్థకు మీరే నాయకులు. రాష్ట్ర, జిల్లా, మండల, సాధికారమిత్రలతో మొదలుపెట్టి అందరికీ స్మార్ట్‌ఫోన్ల పంపిణీని ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 


రూ.50వేల ఆదాయమే లక్ష్యం 
‘మండలకేంద్రాల్లో ఏర్పాటుచేసే సూక్ష్మ మధ్యతరహా పారిశ్రామిక పార్కు (ఎంఎస్‌ఎంఈ)లలో డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యమిస్తాం. ఇంటి వద్ద తయారుచేసిన ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసుకోడానికి, భద్రపరుచుకోడానికి గోదాములు, సరకు రవాణాకు వసతులు కల్పిస్తాం. కొత్త వస్తువులకు బ్రాండ్‌ తయారుచేస్తాం. మొదటివిడత రూ.10వేల ఆదాయం, రెండోవిడత రూ.25వేలు, మూడో దశలో రూ.50వేలు నెలకు సంపాదించేలా వారు ముందుకెళ్లాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆయా సదస్సుల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే: ముఖ్యమంత్రి

వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఎన్నికల ముందు దొంగ సర్వేలు అలవాటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. డబ్బుతో ప్రజాభిమానాన్ని కొనగలమన్న అహంభావంతో వైకాపా ఉందని మండిపడ్డారు. ‘దుష్ప్రచారంలో జగన్‌ ఘనాపాటి. డబ్బుతో దేన్నయినా కొనగలనన్న అహంభావం ఆయనది. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే తప్పుడు సర్వేలు ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించింది. దొంగ సర్వేలతో ప్రజాదరణ తారుమారు చేయలేరు. ప్రజాభిమానాన్ని తెదేపాకు దూరం చేయడం అసాధ్యం’ అని శుక్రవారం ఉదయం తెదేపా నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రతికూల నాయకత్వానికి జగన్‌ రుజువు. వైకాపాది పెడధోరణి’ అని ధ్వజమెత్తారు. జగన్‌ అహంభావం భరించలేకే అనేక మంది ఆ పార్టీకి దూరమవుతున్నారని.. వంగవీటి రాధాకృష్ణ, నిర్మాత ఆదిశేషగిరిరావు కూడా ఇలాగే బయటకు వచ్చారని వివరించారు. బాధ్యతారాహిత్యానికి జగన్‌ ప్రతిబింబమని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై మోదీని జగన్‌ ప్రశ్నించరని చంద్రబాబు ధ్వజమెత్తారు. 


వెలుగు ఉద్యోగులకు వరాలు

* గతంలో ప్రకటించిన 20శాతానికి అదనంగా మరో 10శాతం కలిపి మొత్తం 30శాతం వేతనాల పెంపు 
* ఎన్టీఆర్‌ ఆరోగ్యకార్డులు. రూ.10లక్షల ప్రమాద బీమా. 10రోజుల వైద్య సెలవులు  
* మండల కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ప్రస్తుత వేతనానికి అదనంగా రూ.3వేలు 
* వందశాతం వేతనంపై హెచ్‌ఆర్‌ఏ, ఈపీఎఫ్‌ మంజూరు 
* ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి. మంత్రిమండలి ఉపసంఘానికి సిఫార్సు చేశాం. దాని నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటాం.


రిటర్న్‌ గిఫ్ట్‌లు మనమే ఇవ్వాలి

‘ఒకరు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటున్నారు. ఆయనకు 5 రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇవ్వడానికి చెల్లెమ్మలు సిద్ధంగా ఉండాలి. ముగ్గురు మోదీలు గద్దల్లా వాలి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 94లక్షల డ్వాక్రా మహిళలు, 55 లక్షల మంది పింఛనుదారులు ఓటేస్తే విజయం మనదే’

 

Source: Eenadu