దోపిడీకి అడ్డుకట్ట వేశాం రుగ్మత తెలిసినా కాంగ్రెస్‌ పట్టించుకోలేదు

22hyd main8a 2
PTI | Updated :January 23, 2019,04:46 IST

దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ దీర్ఘకాలం పాలించినా అవినీతిని మాత్రం ఆపలేకపోయిందని, తాము అధికారంలోకి వచ్చాక దోపిడీకి అడ్డుకట్ట వేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో 85% దోపిడీని భాజపా ఆపగలిగిందని తెలిపారు. వారణాసిలో మంగళవారం 15వ ప్రవాసీ భారతీయ దివస్‌ (పీబీడీ)ను ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. కేంద్రం విడుదల చేసే ప్రతి రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతుందని మాజీ ప్రధాని ఒకరు (రాజీవ్‌గాంధీ) చెప్పినా అలా జరగకుండా చూడడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయాయని విమర్శించారు. ‘రుగ్మత ఏమిటో కాంగ్రెస్‌కి తెలుసు. దానిని నయం చేసే ఔషధాన్ని ఇవ్వాలనే ఆలోచన మాత్రం చేయలేకపోయింది. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. నిధులు కిందివరకు చేరడంలో లోపాలను సాక్షాత్తూ అప్పటి ప్రధానే గుర్తించినా ఆ తర్వాత 10-15 ఏళ్లలోనూ లూటీని అడ్డుకునేందుకు ఎలాంటి కృషి జరగకపోవడం విచారకరం. మధ్య తరగతి ప్రజలు చిత్తశుద్ధితో పన్నులు చెల్లిస్తుంటే 85 శాతం లూటీ మాత్రం నిరాటంకంగా సాగిపోతూ వచ్చింది. ఈ లూటీని పూర్తిగా ఆపడానికి మేం సాంకేతికతను మార్గంగా ఎంచుకున్నాం. గృహ నిర్మాణం, విద్య, ఉపకార వేతనాలు, గ్యాస్‌ సిలిండర్లు వంటి వాటికి ఇచ్చే డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే బదలాయించేలా చేశాం. పాత పద్ధతిలోనే దేశం నడుస్తూ ఉన్నట్లయితే ఇలాంటి రూ.5,80,000 కోట్లలో రూ.4,50,000 కోట్లు పక్కదారి పట్టి ఉండేవి’ అని చెప్పారు. భారత్‌ మారదనే ఆలోచన ధోరణిని ప్రపంచ దేశాల్లో తాము మార్చగలిగామన్నారు. ప్రవాస భారతీయులు మన దేశానికి ప్రచార రాయబారుల వంటివారని, దేశ సామర్థ్యాలకు వారంతా ప్రతీకలని కొనియాడారు. 


పరిశుభ్రత ప్రజా ఉద్యమంగా మారాలి 
జాతిపిత మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చేపట్టిన 150 కి.మీ. పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రత్యక్ష ప్రసార సదస్సు విధానంలో మాట్లాడారు. 
శుద్ధ ఇంధనాన్ని ప్రోత్సహించే రీతిలో అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పడడంలోనూ ప్రపంచ దేశాలకు మోదీ నేతృత్వం వహించారని మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ కొనియాడారు. వచ్చే ఏడాది తమ దేశంలో భగవద్గీత మహోత్సవాన్ని, భోజ్‌పురి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 


చిప్‌ ఆధారిత ఈ-పాస్‌పోర్టులు 
ప్రవాస భారతీయుల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దీనిలో భాగంగా చిప్‌ ఆధారిత ఈ-పాస్‌పోర్టుల్ని ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని వెల్లడించారు. దీనికి తగ్గట్టుగా అన్ని దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలను త్వరలో పాస్‌పోర్టు ప్రాజెక్టులో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ఈ-వీసాల జారీతో చాలామందికి ప్రయోజనం కలుగుతోందని, దీనిని ఇంకా సరళతరం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు నమో యాప్‌ ద్వారా పరీక్షల ఒత్తిడిపై  విద్యార్థులతో మాట్లాడతానని మోదీ ప్రకటించారు.

 

Source: Eenadu