ఫ్రంట్‌పై ముందుకు సమాఖ్య కూటమిపై తెరాస, వైకాపాల మధ్య కీలక చర్చలు

16hyd main1a 1
PTI | Updated :January 17, 2019,04:22 IST

ఈ రోజు జరిగింది మొదటి సమావేశం మాత్రమే. తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై ఇప్పటికే మేం స్పష్టతనిచ్చాం. అప్పటి ప్రధాని లోక్‌సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పాం. త్వరలో మా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అమరావతికి వెళ్లి జగన్‌తో మరింత లోతుగా చర్చిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా ఏ విధంగా పోరాడాలనే దానిపై మాట్లాడతారు

- తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌


తెరాసతో చర్చలను స్వాగతిస్తున్నాం. రాష్ట్రాల హక్కులు, సమాఖ్య కూటమి ఏర్పాటు దిశగా  తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయం. అన్యాయాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్రాలు ఒకే వేదికపైకి రావాలి. కేసీఆర్‌ ప్రతిపాదించిన సమాఖ్య కూటమి విషయంలో రాష్ట్రాలు ముందుకు రావాలి. కేసీఆర్‌తో తదుపరి చర్చలు జరుపుతాం

- వైకాపా అధినేత జగన్‌

 

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న సమాఖ్య కూటమికి సంబంధించి మరో అడుగు పడింది. కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటయ్యే ఈ కూటమిలో వైకాపాను భాగస్వామిగా చేర్చే విషయమై ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల మధ్య కీలక చర్చలు జరిగాయి. బుధవారం హైదరాబాద్‌లోని జగన్‌ నివాసం ఈ చర్చలకు వేదికైంది. కేసీఆర్‌ ప్రయత్నం.. స్వాగతించాల్సిన విషయమని, దీనిపై పార్టీలో చర్చించుకొని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకుంటామని ఈ సందర్భంగా జగన్‌ ప్రకటించారు. జగన్‌తో ప్రాథమిక చర్చలు జరిపామని.. త్వరలోనే సీఎం కేసీఆర్‌ ఆయనతో 
సమగ్రంగా చర్చిస్తారని కేటీఆర్‌ చెప్పారు.

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం కేటీఆర్‌ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెరాస తరఫున ఎంపీలు వినోద్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, పార్టీ శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైకాపా నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు ఎస్వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి, నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు జగన్‌, కేటీఆర్‌ల మధ్య సమాఖ్య కూటమి, ఇతర అంశాలపై చర్చలు జరిగాయి. చివరన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చర్చల అనంతరం కేటీఆర్‌, జగన్‌ విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రాలు ఒకే వేదికపైకి రావాలి: జగన్‌ 


‘‘కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. తారక్‌(కేటీఆర్‌) ఈ రోజు వచ్చి చర్చించారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, సమాఖ్య కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించాం. అన్యాయానికి గురికాకుండా కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్రాలు ఒక వేదికపైకి రావాలి. లేకుంటే హక్కులు సాధించలేం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చేసిన హామీకే దిక్కూదివానం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలకుతోడు.. పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు జత అయితే.. మొత్తం 42 మంది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించగలిగితే.. పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట అని చెప్పగలిగితే.. కేంద్రం దిగి వస్తుంది. రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి. రాష్ట్రాల బలం పెరిగితే.. అప్పుడు అన్యాయం చేసేలా నడుచుకోవడానికి కేంద్రం వెనుకడుగు వేస్తుంది. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక జాతీయస్థాయి వేదిక ఏర్పాటు చేశారు. ఎంపీల పరంగా ఏకం చేసి.. రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ముందుకు వెళ్లాలనుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ అంశంపై మరోసారి చర్చలకు వస్తామని కేసీఆర్‌ ఫోన్‌లో చెప్పారు. ఆయన చెప్పిన అంశాలపై పార్టీలో సమగ్రంగా చర్చించి.. రాబోయే రోజుల్లో వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తాం. కేసీఆర్‌తో తదుపరి చర్చలు జరుపుతాం’’ అని జగన్‌ పేర్కొన్నారు.

ఏపీ ఎన్నికలపైనా చర్చ 


సమాఖ్య కూటమిపై చర్చించేందుకు జగన్‌తో భేటీపై మంగళవారం నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌ దీనిపై ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. కేటీఆర్‌, ఇతర ముఖ్య నేతలను చర్చలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వారిని తమ ఇంటికి రావాలని జగన్‌ ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కి కేటీఆర్‌ ఇతర నేతలతో కలిసి జగన్‌ ఇంటి వద్దకు వచ్చారు. ఆయనకు వైకాపా నేతలు స్వాగతం పలికారు. జగన్‌ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి కేటీఆర్‌ను  లోనికి తోడ్కొని వెళ్లారు. సమాఖ్య కూటమి సన్నాహాలపై కేటీఆర్‌, ఎంపీ వినోద్‌లు జగన్‌కు వివరించారు. కూటమిలో చేరడం వల్ల వైకాపాకు మేలు జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్‌, భాజపాలు ఆంధ్రాకు అన్యాయం చేశాయనే భావనతో ఆ రాష్ట్ర ప్రజలున్నందున  ప్రత్యామ్నాయ ప్రతిపాదన వారిని ప్రభావితం చేస్తుందని కేటీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, రాబోయే ఎన్నికల మీద చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంపై కేటీఆర్‌, తెరాస నేతలకు జగన్‌ అభినందనలు తెలిపినట్లు తెలిసింది. జగన్‌ పాదయాత్ర అనుభవాలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.

ఏపీలో తెరాస పోటీ చేయదు: విజయసాయిరెడ్డి 
ఆంధ్రప్రదేశ్‌లో తెరాస పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌, కేటీఆర్‌లు సమాఖ్య కూటమి గురించి చర్చలు జరిపారు. త్వరలో కేసీఆరే స్వయంగా జగన్‌తో చర్చలు జరుపుతారు. రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో పోరాడటానికి ఒక వేదికగా సమాఖ్య కూటమి నిలుస్తుంది. తెరాస, వైకాపాలేగాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయి. కూటమిలో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా కూటమి నేతలు ప్రచారం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైకాపా మద్దతు ఉంటుంది’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌

చర్చల అనంతరం కేటీఆర్‌ సమక్షంలో కేసీఆర్‌ ఫోన్‌లో జగన్‌తో మాట్లాడారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన పాదయాత్రపై అభినందనలు తెలిపారు. త్వరలోనే అమరావతికి వచ్చి కలుస్తానని, అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. అమరావతిలో ఈ నెల నాలుగో వారంలో తన గృహప్రవేశం ఉందని, దానికి రావాలని ఈ సందర్భంగా జగన్‌.. కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలిసింది.

గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు: కేటీఆర్‌

‘‘తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడిచిన ఏడాదిన్నరగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం అధికారాలను తన వద్ద పెట్టుకొని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాఖ్య స్ఫూర్తితో పోరాటాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయా పార్టీల అధ్యక్షులతో సంప్రదింపులు జరిపి.. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత జగన్‌కి కేసీఆర్‌ ఫోన్‌ చేసి.. మాట్లాడేందుకు వస్తాం అని చెప్పగా.. ఆయన రమ్మన్నారు. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. రాష్ట్రాలను శక్తిమంతం చేయడానికి, హక్కులను కాపాడటానికి భవిష్యత్తులో సందర్భానుసారంగా.. ఒకే రకమైన ఆలోచనా ధోరణి గల వారమంతా కలిసి ముందుకు వెళతాం. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి..     జగన్‌తో మాట్లాడాక.. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకుపోతాం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మా వైఖరిని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తోసహా రాజ్యసభలో మా పార్టీ నేత కేశవరావు, లోక్‌సభలో ఎంపీ కవిత పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అప్పటి ప్రధాని లోక్‌సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేం చెప్పాం. ఈ రోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రమే. మిగతా అంశాలన్నింటినీ సీఎం కేసీఆర్‌ జగన్‌ను కలిసిన తర్వాత సమగ్రంగా చర్చిస్తారు’’ అని కేటీఆర్‌ తెలిపారు. ‘ఈ రోజే అన్నీ చెప్పేస్తే మీడియాకు రాసుకోవడానికి ఏం మిగలదు’ అంటూ చమత్కరించారు.
 

Source: Eenadu