జగన్‌తో చర్చలు జరపనున్న కేటీఆర్‌ బృందం

15brk142a
PTI | Updated :January 16, 2019,04:24 IST

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌తో కేటీఆర్‌ బృందం ఇవాళ హైదరాబాద్‌లో చర్చలు జరపనుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్‌, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ కూటమితో తెదేపా అధినేత చంద్రబాబు జట్టుకట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఎదురుగాలి వీస్తుండటంతో జగన్‌ ముందున్న మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్‌ ఒక్కటే.

Source : Eenadu