ఆగం కావొద్దు యాగం ఆగొద్దు ఇక్కడ కీలుబొమ్మ ప్రభుత్వం రావాలన్నదే చంద్రబాబు లక్ష్యం

Pic
PTI | Updated :December 06, 2018,04:19 IST

 

ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాకూటమి రూపంలో ప్రమాదం ముంచుకొస్తోందని.. వలస శక్తులకు చోటివ్వద్దని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చావనైనా చస్తాను గానీ.. తన కంఠంలో ప్రాణముండగా మళ్లీ తెలంగాణను బానిస కానివ్వనన్నారు. తెరాస ప్రభుత్వం ఉన్నంత కాలం, తాను బతికి ఉన్నంత వరకూ రైతులకు ఉచితంగా 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తామని స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. చివరి ఎన్నికల ప్రచార సభలో దాదాపు 43 నిమిషాల సమయం ప్రసంగించారు. ప్రజాకూటమి రూపంలో ప్రమాదం ముంచుకొస్తోందని, తస్మాత్‌ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. కాళేశ్వరం కావాలో? శనేశ్వరం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఇదే సమావేశంలో పార్టీ పార్లమెంటరీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు మాట్లాడుతూ కేసీఆర్‌ అన్ని చోట్లా తిరుగుతూ తెరాస అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారన్నారు. ఆయనకు ఓటేయాలని కేసీఆర్‌ తరఫున తాను గజ్వేల్‌ ప్రజలను కోరుతున్నానని వివరించారు. సభలో ఇంకా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు...

అన్నీ భరించాం 
రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు చిమ్మచీకటి. ఏం తెలియదు. హైకోర్టు విభజన కానియ్యరు. ఉద్యోగులను నియమించరు. కేంద్రం సహకరించదు. ఏడు మండలాలు లాక్కున్నారు. సీలేరు పవర్‌ ప్రాజెక్టును చంద్రబాబు గుంజుకున్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. విభజన చట్టం ప్రకారం విద్యుత్తు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. చట్టం అమలు చేయాలని ప్రధాని మోదీని అడిగితే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఆయన కింద పనిచేసే బ్రోకర్లు కరెంటు కోతలు ఎత్తివేయాలనేవారు. కింద సెగపెట్టాలి. నెత్తిన చేయి పెట్టాలి అన్నట్లుగా పరిస్థితి. అన్నీ భరించాం తట్టుకున్నాం. చిమ్మచీకట్లను తొలగించి వెలుగు జిలుగుల తెలంగాణగా చేసుకున్నాం.

 

బాబువి మాయమాటలు 
కోదాడలో రాహుల్‌, చంద్రబాబు చివరి సభ నిర్వహించారు. కృష్ణాలో నీళ్లు లేవు. గోదావరి జలాలను పంచుకుందామని చంద్రబాబు చెబుతున్నారు. కాంగ్రెస్‌ వారిని కూర్బోబెట్టి, వాళ్ల అధినేత రాహుల్‌గాంధీ సమక్షంలో చంద్రబాబు ఎండార్స్‌ చేస్తున్నారు. కృష్ణాలో నీళ్లు లేవంటే మన కాంగ్రెస్‌ వాళ్లు తలలూపుతున్నారు.  మన గడ్డ మీద నిలబడి మాయమాటలు మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించండి. మనకంటే ఆయనకు పెద్ద రాష్ట్రం ఉంది. మనకు 119 నియోజకవర్గాలుంటే ఆయనకు 175 ఉన్నాయి. కానీ తెలంగాణలో తాను నడిపే కీలుబొమ్మ ప్రభుత్వం కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అధికారంలో ఎవరున్నా ఏం కాదు. ఒక్క కేసీఆర్‌ మాత్రం ఉండకూడదు. కేసీఆర్‌ దెబ్బకు కరకట్ట వద్దకు పోయాడు. నేనుంటే హక్కులను కోల్పోనివ్వను. వాళ్ల ఆటలు సాగవు. ఇక్కడ వేరేవారుంటే గోల్‌మాల్‌ తిప్పి చేయవచ్చనేది బాబు ఆలోచన. దానికోసం అక్రమంగా సంపాదించిన సొమ్ములు తీసుకొని, ఆంధ్రా నుంచి నాయకులు, ఇంటెలిజెన్స్‌ వారిని తెచ్చి ఇక్కడ మోహరించారు. మనమంతా అమాయకులమని, గోల్‌మాల్‌ చేయవచ్చని డబ్బులిచ్చి కొనుక్కోవచ్చని ఈ రోజు కూడా చంద్రబాబు విర్రవీగుతున్నారు. ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడం చేతకాక..ఆంధ్రాకు వెళ్లి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంపడే ఆయనను మోసుకొస్తారా? ప్రజలు ఆలోచన చేయాలి.

అధికార కాంక్ష కాంగ్రెస్‌ది 
అధికారం లేకుంటే కాంగ్రెస్‌ వారు బతకలేరు. వారిది అధికార కాంక్ష. అధికారం చేతుల్లోంచి జారిపోయిందనే బాధ. కేసీఆర్‌ కొరకరాని కొయ్యగా మారాడని చంద్రబాబు బాధ. వెరసి రెండు కత్తులు మనమీదకు వస్తున్నాయి. ప్రమాదం ముంచుకొస్తోంది. తస్మాత్‌ జాగ్రత్త. ఇప్పుడు ఎన్నికల్లో కొట్లాడాల్సింది నేను కాదు మీరు. మీ ఓటుతో దెబ్బకొట్టాలి. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఈ ఇనుప మూతి గద్దలకు ఇస్తే చాలా ప్రమాదం. తెలంగాణకు మేధావులు రక్షణ కవచంగా నిలవాలి. 1956లో బూర్గుల రామకృష్ణారావు తెలంగాణను ఆగం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అంటే కనీసం ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. పేదల కంట కన్నీరు రాని తెలంగాణ నా స్వప్నం. దుఃఖం లేని తెలంగాణ చూడాలనేది నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు సాగునీరిచ్చేలా నేను యజ్ఞం చేస్తున్నా. యావత్‌ తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి. దాచి దాచి దెయ్యాలపాలు చేయవద్దు. నాలుగున్నరేళ్లలో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణను మార్చుకున్నాం. ఇది కొనసాగాలి. మన ప్రయాణం, మన యజ్ఞం ఆగొద్దు.’’ అని కేసీఆర్‌ తన చివరి బహిరంగసభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Source: Eenadu