‘మంకీ గేట్ వివాదంతో తాగుబోతునయ్యా’

Symonds
PTI | Updated :November 02, 2018,10:39 IST

సిడ్నీ : మంకీ గేట్‌ వివాదం గురించి తెలియని క్రికెట్‌ ప్రేమికులుండరు. భారత సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. 2008 సిడ్నీ టెస్ట్‌లో చోటు చేసుకున్న ఈ వివాదాన్ని తాజాగా ఆండ్రూ సైమండ్స్‌ మరోసారి ప్రస్తావించాడు. ఈ వివాదం తనను ఓ తాగుబోతుని చేసిందని, దీంతోనే తన జీవితం నాశనమైందని నాటి సంఘటనను గుర్తుచేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఆ వివాదంతో నేను ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోడం మొదలు పెట్టాను. దీంతో నా కెరీర్‌ కూడా నాశనమవడం ప్రారంభమైంది. ఆ ఘటనతోనే నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఈ వివాదంపై నేను డీల్‌ చేసిన విదానం కూడా సరైది కాదు. చాలా గిల్టీగా ఫిలయ్యాను. ఇక చాలా సార్లు హర్భజన్‌ నన్ను దూషించాడు. భారత్‌లోనే నన్ను మంకీ అని పిలిచాడు. ఈ విషయంపై నేను అతని డ్రెస్సింగ్‌ రూం వెళ్లి మరి మాట్లాడాను. అలా పిలవడం ఆపకపోతే పెద్ద సమస్య అవుతోందని చెప్పాను’ అని నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు.

అయితే 2009లో చివరి మ్యాచ్‌ ఆడిన సైమండ్స్‌.. చాలా సార్లు జట్టు నిబంధనలు బ్రేక్‌ చేయడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా అతని కాంట్రాక్టును రద్దు చేసింది. ఇక సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్‌ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో వివాదస్పదమైంది. దీంతో రిఫరీ హర్భజన్‌పై మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే ఈ వివాదంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత్‌ ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్‌ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ భజ్జీ శిక్షను రద్దు చేశారు.

Source : Sakshi