సచిన్‌ నా పేరు చెప్పగానే ఏడ్చేశా : శ్రీశాంత్‌

Sreesanth
PTI | Updated :October 16, 2018,10:36 IST

ముంబై : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో  టీమిండియా వివాదస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘సచిన్‌ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. 2011 ప్రపంచకప్‌ గెలిచిన రెండు మూడేళ్లకు జట్టంతా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూయర్‌ ప్రపంచకప్‌ గెలిచిన సందర్భాన్ని గొప్పగా వివరిస్తూ విజేత జట్టు సభ్యులందరి పేర్లు చెప్పాడు. కానీ నా పేరు ప్రస్తావించలేదు. అయినా నేనూ మధ్యలో మాట్లాడలేదు. ఇంటర్వ్యూ ముగిసే వరకు మౌనంగానే ఉన్నా. చివరి నిమిషం వరకూ కూడా ఆ జర్నలిస్ట్‌ నా పేరు ప్రస్తావించలేదు. అప్పడు సచిన్‌ కలుగ జేసుకుని, ఈ విజయంలో శ్రీశాంత్‌ కూడా కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. ఆ మాటలు విన్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. నేను చాలా సేపటి వరకు ఏడ్చాను.’ అని శ్రీశాంత్‌ బిగ్‌బాస్‌ సహచరుడు అనుప్‌ జలోటకు తెలిపాడు. 

దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ షో ఆరంభం నుంచి శ్రీశాంత్‌ వైఖరి హాట్‌ టాపిక్‌ అయింది. హౌస్‌లో శ్రీశాంత్‌ చేసే ప్రతి పని చర్చనీయాంశమవుతోంది. 2013 ఐపీఎల్‌లో శ్రీశాంత్ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. సుమారు ఐదేళ్లు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌ ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలు చేస్తున్నారు. 

Source ; Sakshi