ఐటీ రైడ్స్‌పై హీరో క్లారిటీ

Vijay sethupathi
PTI | Updated :September 30, 2018,04:40 IST

ఇటీవల నా ఇంటిలో జరిగింది ఐటీ సోదా లు కాదని, అది సర్వే మాత్రమేనని నటుడు విజయ్‌సేతుపతి వివరణ ఇచ్చారు. ఈయన నటి త్రిషతో కలిసి నటించిన చిత్రం 96. నిర్మాత ఎస్‌.నందగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  5న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం మధ్యాహ్నం చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో విజయ్‌సేతుపతి మాట్లాడుతూ 96 చిత్రం ప్రారంభం కావడానికి దర్శకుడు ప్రేమ్‌కుమార్‌నే కారణం అన్నారు. ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలను కచ్చితంగా పూర్తి చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఈ చిత్రానికి అందరం చాలా ప్రశాంతంగా పని చేశామని చెప్పారు. ఎవరికి ఎవరిపైనా సందే లు లేవన్నారు. ఒక రోజు రాత్రి జరిగే సంఘటనల ఇతివృత్తమే 96 చిత్రం కథ అని చెప్పారు.

ఐటీ సర్వే అన్నది ఇప్పుడే తెలిసింది
ఇకపోతే తన ఇంట్లో ఐటీ దాడులు జరిగాయనే ప్రచారం జరుగుతోందని, నిజానికి అవి దాడులు కాదని సర్వేనని చెప్పారు. ఆదాయశాఖలో సర్వే అనేది ఒకటుందన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. తాను మూడేళ్లుగా ఇన్‌కంటాక్స్‌ను ముందుగానే చెల్లిస్తున్నానని తెలిపారు. అయితే రిటర్న్‌ దాఖలు చేయలేదన్నారు.

దీంతో తన ఆడిటర్‌ సడన్‌గా రిటర్న్‌ పత్రాలను దాఖలు చేయడంతో  ఆదాయశాఖ అధికారులు వచ్చి సర్వే చేసుకుని వెళ్లారని వివరించారు. దీన్నే రైడ్‌ అని ప్రచారం చేశారని అన్నారు. అసత్యాలే వేగంగా వ్యాపిస్తాయని, మనం డబ్బు ఇచ్చినా కూడా అలా జరగదని విజయ్‌సేతుపతి అన్నారు. సమావేశంలో నటి త్రిష, దర్శకుడు ప్రేమ్‌కుమార్, నిర్మాత ఎస్‌. నందకుమార్‌ చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.

Source : Sakshi