రాజకీయాల్లోకి వస్తా....!

Amala
PTI | Updated :September 28, 2018,05:36 IST

సినిమా: నేను రాజకీయాల్లోకి రావడం పక్కా అంటోంది నటి అమలాపాల్‌. ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ జాణను ఇప్పుడు తెలుగులో పట్టించుకోవడం లేదు గానీ, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూనే ఉంది. అంతే కాదు త్వరలో బాలీవుడ్‌ రంగ ప్రవేశం షురూ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఈ అమ్మడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య నటుడు ధనుష్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించిన అమలాపాల్‌ అంతకుముందు ఆయన దర్శకత్వం వహించి నటించిన అమ్మ కణక్కు చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించింది. అయితే ఆ తరువాత ఏం అయ్యిందోగానీ, ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటించడానికి అంగీకరించి ఆ తరువాత ఆ చిత్రం నుంచి వైదొలగి వార్తల్లోకెక్కింది. ఆ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం ఈ భామ నటుడు విష్ణువిశాల్‌తో నటించిన రాక్షసన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ చిత్రంతో విష్ణువిశాల్‌ లాంటి మంచి మిత్రుడు లభించాడని ఇటీవల ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై చెప్పింది. అంతేకాదు రాక్షసన్‌ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నానని తెలిపింది. దీని గురించి అమలాపాల్‌ చెబుతూ  ఒకరు నటించిన పాత్రకు వేరొకరు డబ్బింగ్‌ చెప్పడం అన్నది బిడ్డను కని వేరొకరికి ఇవ్వడం లాంటిది అనీ అందుకే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటానన్న కండిషన్‌తోనే ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పుకొచ్చింది. ఇకపోతే చాలా మంది తారలు రాజకీయరంగానికి ఆసక్తి చూపుతున్నారు మీకూ అలాంటి కోరిక ఉందా? అని చాలా మంది అడుగుతున్నారని, ఈ ప్రశ్నకు తాను భవిష్యత్‌లో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది. తాను హిమాలయాలకు తరచూ వెళ్లి వస్తున్నానని, అక్కడి సహజమైన ప్రకృతి సౌందర్యంతో మనసు పరవశిస్తుందని అంది. అంతే కాదు ఆధ్యాత్మిక భావన కలుగుతుందని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తన జీవితాన్ని మార్చేసింది హిమాలయాలేనని పేర్కొంది. అక్కడకు వెళ్లడం అన్నది భగవంతుడికి దగ్గరకు చేరడంలా ఉంటుందని చెప్పింది. ఇకపోతే ఆడై చిత్రంలో గ్లామరస్‌గా నటించడం గురించి అడుగుతున్నారని, ఆ చిత్ర కథకు అవసరం అవడం వల్లే అలా నటించాల్సి వస్తోందని చెప్పింది. అదేవిధంగా తనను చాలా మంది తరచూ అడిగే ప్రశ్న మళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అంది. అయితే  ప్రస్తుతం మళ్లీ పెళ్లి గురించి ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది.

Source : Sakshi