రాజ్యాంగేతర శక్తిగా చింతమనేని

Pa
PTI | Updated :September 27, 2018,04:16 IST

     జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజం

     ఆయనంటే చంద్రబాబు సైతం భయపడుతున్నట్టుంది

     అందుకే చర్యలకు వెనకడుగు

     న్యాయవ్యవస్థే సుమోటోగా కేసు నమోదు చేయాలి

ఏలూరు (టూటౌన్‌)/ దెందులూరు: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, అధికారులు ఆఖరికి కార్మికులు ఇలా అందరిపై దాడులు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక హత్యాయత్నం కేసుతో సహా చింతమనేనిపై 27 కేసులు ఉన్నాయని తెలిపారు. న్యాయ వ్యవస్థ నేరుగా జోక్యం చేసుకుని సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. బుధవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జరిగిన సభలో పవన్‌ మాట్లాడారు. చింతమనేని ఒక వీధి రౌడీలా, ఆకు రౌడీలా, చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు.

ఆయనంటే చంద్రబాబుకు సైతం భయం వేస్తున్నట్లు ఉందన్నారు. అధికారంలో ఉన్న పాలకులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జనసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపివేయడం, చురుగ్గా ఉండే కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రుణాలను నిలిపివేయడం వంటి కక్షపూరిత చర్యలు దారుణమన్నారు. రాష్ట్రంలో ఇటువంటి రౌడీ ఎమ్మెల్యేల కారణంగా ఎదురవుతున్న పరిస్థితులు, అరాచకాలపై విపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీని నిలదీయాలని కోరారు.

ప్రశ్నించే వారు లేకపోవడంతో ఎమ్మెల్యేలు మరింత పేట్రేగిపోతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటొచ్చినా చాలని, దానితోనే పోరాటం చేస్తామని, చట్ట సభలో నిలదీస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు జనసేన తరఫున ముఖ్యమంత్రి అయిపోవాలని తాము అనుకోవడం లేదని, దానికోసం ప్రజా సమస్యలపై మరో 25 ఏళ్లు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ముందుకు వస్తే జనసైనికుడ్ని గాని వీర మహిళను గాని ఎమ్మెల్యేగా పోటీలో నిలుపుతామని చెప్పారు.

Source : Sakshi