విలన్‌గా వచ్చి హీరోనయ్యా

Ashish gandhi
PTI | Updated :September 27, 2018,04:22 IST

నాటకం’కథానాయకుడుఆశిష్‌ గాంధీ

ముషీరాబాద్‌: ఎలాంటి బాధ్యతలు లేని ఓ యువకుడు బాలకోటేశ్వరరావు. అనుకోకుండా పెద్ద లక్ష్యాన్ని భుజానకెత్తుకుంటాడు. దాన్ని ఎలా సాధించాడనేది తెరపై చూడాల్సిందేనంటున్నాడు ‘నాటకం’ సినిమా హీరో ఆశిష్‌ గాంధీ. రాంనగర్‌లో పుట్టిపెరిగి ఇక్కడే చదువుకున్న ఓ సామాన్య యువకుడు ఆశిష్‌. సినిమాపై ఉన్న ఆసక్తితో మొదట మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని తర్వాత మోడలింగ్‌ చేశాడు. తన మనసు సినిమాల వైపే లాగుతుండడంతో కొన్ని షార్ట్‌ ఫిల్మŠస్‌ సైతం తీశాడు. ఆపై ‘పటాస్, డీజే, లై, ఉన్నది ఒకటే జిందగీ, విన్నర్‌’ వంటి పలు చిత్రాల్లో నెగిటివ్‌ (విలన్‌) పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. అప్పటి విలన్‌ ఇప్పుడు ‘నాటకం’ సినిమా ద్వారా హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ఈనెల 28న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆశిష్‌ గాంధీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ వివరాలు ఆశిష్‌ మాటల్లోనే..

‘‘ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహించాడు. శ్రీసాయిదీప్‌ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్‌ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మాతలు. హీరోగా నా తొలి చిత్రమిది. బాలకోటేశ్వరరావు, పార్వతి అనే జంట స్వచ్ఛమైన ప్రేమ కథ ఇందులోని స్టోరీ. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కథానుగుణంగానే బోల్డ్‌గా, రియలిస్టిక్‌గా సినిమాను చిత్రీకరించాం. ప్రేమ, యాక్షన్, రొమాన్స్‌ హంగుల సమ్మిళితంగా దర్శకుడు కళ్యాణ్‌ సినిమాను తీర్చిదిద్దారు. ఏడేళ్లుగా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి నేను పడుతున్న కష్టాలు చూసి నటుడిగా నాకో మంచి జీవితాన్ని ఇవ్వడానికే మా అన్నయ్య ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. సిటీలో పెరగడంతో పల్లెటూరి పాత్ర కోసం మూడు నెలల పాటు హోమ్‌వర్క్‌ చేశాను. రంగస్థలం, ఆర్‌ఎక్స్‌ 100 కథలతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. రోటీన్‌కు భిన్నమైన కథను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. మా నాన్న గాంధీ అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం బాంబే వరకు వెళ్లారు. కానీ నటుడు కాలేకపోయారు. మా నాన్న కోరికను తీర్చాలనే లక్ష్యంతో నేనీప్రయత్నానికి పూనుకున్నాను. దానికి తగ్గట్టూగానే విలన్‌తో పాటు, హీరోగా అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ ముగించాడు. 

Source : Sakshi