జనం తోడుగా రావాలి జగన్‌...కావాలి జగన్‌

7
PTI | Updated :September 19, 2018,03:53 IST

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయడంతో పాటు, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను వివరించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమం జనంతోడుగా సాగుతోంది. అన్నివర్గాల ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలంలోని సిరిగేదొడ్డి, కేఎస్‌దొడ్డి గ్రామాల్లో చేపట్టిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి,  పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, మండల కన్వీనర్‌ గౌని కాంతారెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన కాపు రామచంద్రారెడ్డి... ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాలను వంచించారని మండిపడ్డారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాలతో సామాన్యులకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరించారు. గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం కొండాపురంలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త వెంకటరామిరెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు హాజరయ్యారు. మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

 డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారంటూ వాపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని గాజులపల్లి గ్రామంలో సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమం చేపట్టారు. వైఎస్‌ జగన్‌ అమలు చేసే నవరత్న పథకాలే పేదలకు అండగా నిలుస్తాయని ఉషశ్రీచరణ్‌ తెలియజేశారు. అన్ని వర్గాలూ వైఎస్‌ జగన్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడగట్ట కిష్టప్ప, మండల కన్వీనర్‌ తిరుమల వెంకటేశులు, పట్టణ కన్వీనర్‌ గోపారం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ అందుతుందని తెలియజేశారు. పేద వర్గాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అమలు చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్‌హెచ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు

Source : sakshi