కేసీఆర్‌కు చంద్రబాబు ప్రేమలేఖ

Ambati
PTI | Updated :September 19, 2018,03:57 IST

కాంగ్రెస్‌తో పీటల మీద కూర్చోబోతూ.. 

ఓటుకు కోట్ల కేసు బయటకు తీయొద్దని సందేశం

కాంగ్రెస్‌పై అప్పుడు నిప్పులు చెరిగి ఇప్పుడు పొత్తు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు   

విజయవాడ సిటీ/సత్తెనపల్లి: కాంగ్రెస్‌తో పెళ్లి పీటలపై కూర్చునేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబుఓటుకు కోట్ల కేసు ఎక్కడ బయటకు తీస్తారోనని భయపడి మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రేమ లేఖ రాశాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ఉండాలనే కోరిక ఉన్నప్పటికీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సమయంలో వారు నాతో విభేదించిన కారణంగా కలిసి ఉండలేకపోతున్నామని ఒక సందేశం పంపించారన్నారు. కలిసి ఉండాలనే కోరికే ఉన్నప్పుడు  కోట్లు వెచ్చించి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని కొనేందుకు సిద్ధపడి రేవంత్‌రెడ్డితో రూ.50 లక్షల అడ్వాన్స్‌ ఎందుకు ఇప్పించారని ప్రశ్నించారు. విజయవాడ, సత్తెనపల్లెలో ఆ పార్టీ కార్యాలయాల్లో అంబటి మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

వందల కోట్లు వెచ్చించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని రహస్యంగా గృహప్రవేశం చేసి హైదరాబాద్‌లోనే సెటిల్‌ అవ్వాలనుకున్న చంద్రబాబు, ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన అనంతరం అమరావతికి పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ఓటుకు కోట్ల కేసు విషయం ఎక్కడ బయటపడుతుం దోనని కేసీఆర్‌కు ప్రేమ సందేశం పంపించారన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ పార్టీ పద్ధతి లేకుండా చేసిందని నిప్పులు చెరిగిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీని చంకన ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో, ఏపీలో కాంగ్రెస్‌కు చంద్రబాబు ఆపరేషన్‌ చేస్తాడని, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మహారాష్ట్ర కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ నోటీసు ఇస్తే లీగల్‌గా పోకుండా ధర్నాలకు దిగడానికి బుద్ధుండాలని ఎద్దేవా చేశారు. 

రంగా కుటుంబానికి అన్యాయం జరగదు
వైఎస్సార్‌సీపీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నదన్నారు. వంగవీటి రాధాకు అన్యాయం చేయాలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు. ఆయన గతంలో విజయవాడ ఈస్ట్‌ నుంచి గెలిచారని, అక్కడే ఆయన గెలుస్తారని అధిష్టానం భావిస్తుందన్నారు. ఇదే కాకుండా మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం కూడా ఆప్షన్‌గా ఇచ్చిందన్నారు. దివంగత నేత రంగా అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 

Source : Sakshi