టీమిండియాలో వారే కీలకం

Brett lee
PTI | Updated :September 08, 2018,04:33 IST

స్పోర్ట్స్‌: యూఏఈ వేదికగా ఈ నెల 15 నుంచి ఆరంభంకానున్న ఆసియా కప్‌కు అన్ని జట్లు సమయాత్తమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌ యూఏఈ చేరుకోగా, బంగ్లాదేశ్‌ ఈ టోర్నీ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ చేస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం టీమిండియా కూడా సన్నాహక శిబిరాల్లో పాల్గొననుంది. అయితే టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి విశ్రాంతితో టీమిండియా బలహీనపడిందని సీనియర్‌ క్రికెటర్లు వాదిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ మాత్రం కోహ్లి లేకున్నా టీమిండియా ఆసియా కప్‌లో రాణించగలదని అభిప్రాయపడుతున్నాడు.

రోహిత్‌, ధావన్‌లు కీలకం..
కోహ్లి గైర్హాజర్‌తో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ విభాగంలో కీలకం కానున్నారని లీ పేర్కొన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తనదైన రోజు ఎలా ఆడతాడో అందరికి తెలుసన్నాడు. నాయకుడిగా రోహిత్‌ జట్టును ముందుండి నడిపించాలి కాబట్టి ఆసియా కప్‌లో అతడి నుంచి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చన్నాడు.  లెఫ్టార్మ్‌ పేసర్ల బౌలింగ్‌లో రోహిత్‌ కాస్త ఇబ్బంది పడుతున్నాడని అది పెద్ద సమస్యే కాదని వివరించాడు.

మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రస్తుత ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. స్లో అండ్‌ లో పిచ్‌లలో ధావన్‌ ఇబ్బందులకు గురవుతున్నాడన్నాడని టెక్నిక్‌ మార్చుకుంటే సరిపోతుందన్నాడు. యూఏఈ పిచ్‌లు భారత్‌లోని విధంగా గబ్బర్‌ సింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నాడు. దీంతో ధావన్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు చూడోచ్చని బ్రెట్‌ లీ అభిప్రాయపడుతున్నాడు. 

Source : sakshi