పోటెత్తిన జన కెరటం

Kcr2
PTI | Updated :September 03, 2018,05:35 IST

ప్రగతి నివేదన సభ జన ప్రభంజనమైంది. పోటెత్తిన జన కెరటం తెరాస శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. తెరాస ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన సమీకరణ యజ్ఞం భారీగా విజయవంతమైంది. అధినేత కేసీఆర్‌ చేత శెభాష్‌ అనిపించుకుంది. కొంగరకలాన్‌ వేదికగా ఆదివారం తెరాస నిర్వహించిన ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది తరలివచ్చారు. 158 కిలోమీటర్ల బాహ్యవలయ రహదారిపై వాహన ర్యాలీ కనువిందు చేసింది. వేదిక దగ్గర బాహ్య వలయ రహదారి చుట్టూ 10 కిలోమీటర్ల మేర కిక్కిరిసిన జనంతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. శనివారం రాత్రి నుంచే మొదలైన పార్టీ శ్రేణుల రాక ఆదివారం సాయంత్రానికి పోటెత్తింది. ఉదయం 10 గంటల సమయానికే భారీగా మహిళలు రావడంతో సభా ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. వారి నృత్యాలు మరింత శోభను చేకూర్చాయి. ఎండ మండినా, మధ్యలో కొంత వర్షం అంతరాయం కలిగించినా జన ప్రభంజనం ఆగలేదు.
బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎంలు, తూఫాన్లు... ఇలా ఒకటేమిటి ఏది దొరికితే అది పట్టుకుని జనం తరలివచ్చారు. జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, బొమ్మలతో ఉన్న వాహనాలు రహదారులను గులాబీమయం చేశాయి. కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భారీగా వాహనాలు రావడంతో పలుచోట్ల వాహనాల రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సభకు 12వేల ట్రాక్టర్లు వచ్చాయి. వాటిలో బాగా అలంకరించిన వాటిని సభ ముందు ప్రదర్శనకు పెట్టారు.
బహిరంగసభ ప్రాంతంలో అలంకరణ ఆకట్టుకుంది. సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ కటౌట్లు, తోరణాలు అలరించాయి. గులాబీ రంగుతో అలంకరించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.​​​​​​​
ప్రగతి నివేదన సభ విద్యుత్తు వెలుగుల్లో జిగేల్‌మంది. సభా ప్రాంగణం, పార్కింగ్‌ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ, మెర్క్యురీ విద్యుత్తు దీపాలను అమర్చడంతో ఆసాంతం ఆ ప్రాంతం పట్టపగలును తలపించింది. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో.. సభ ఆసాంతం విద్యుత్తు అంతరాయం లేకుండా కొనసాగింది.​​​​​​​
ప్రగతి నివేదన సభకు హాజరైన కార్యకర్తల్లో చాలామంది 12 గంటలపాటు సభా ప్రాంగణంలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకే చేరుకున్న వారంతా రాత్రి ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసేంత వరకూ అక్కడే ఉండిపోయారు. వారికి నిర్వాహకులు ప్యాకెట్లలో భోజనం, మంచినీళ్లను అందించారు. కొందరు అక్కడే భోజనాలు తయారు చేసుకున్నారు.​​​​​​​
కొంగరకలాన్‌ సభ ఇన్‌ఛార్జి కేటీఆర్‌ మంత్రిమండలి సమావేశానికి వెళ్లకుండా సభ వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలుత బాహ్య వలయ రహదారిపై, ఆతర్వాత ప్రధాన వేదిక, సాంస్కృతిక వేదిక వద్దకు వెళ్లి సౌకర్యాలను పరిశీలించారు. అమరవీరుల స్థూపం ఏర్పాట్లు చూశారు. మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులు హెలికాప్టర్‌లో సభావేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వేదిక వద్దకు వచ్చారు.​​​​​​​
 

source: Ennadu